బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : ఆదివారం, 2 డిశెంబరు 2018 (13:48 IST)

అక్క సుహాసినికి హ్యాండిచ్చిన జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అక్క సుహాసిని హ్యాండిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో భాగంగా కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి తన అక్క నందమూరి వెంకట సుహాసిని పోటీ చేస్తోంది. ఇందుకోసం ఆమె ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఆమె తరపున నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు ప్రచారం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రకారంగానే బాలయ్య, తారకరత్నలు ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 
 
అలాగే, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, అభిమానుల ఆశలపై జూనియర్ ఎన్టీఆర్ నీళ్లు చల్లాడు. కూకట్‌పల్లిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అక్క సుహాసిని తరుపున ప్రచారానికి ఎన్టీఆర్ వస్తారని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే ప్రకటన ద్వారా మద్దతు ప్రకటించిన ఎన్టీఆర్, తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
 
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. హేమాహేమీలు అంతా ప్రచారంలో పాల్గొంటూ తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తున్నారు. ప్రధానంగా మహాకూటమి నుంచి కూకట్‌పల్లి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె నందమూరి తారకరామారావు మనవరాలు, దివంగత నందమూరి హరికృష్ణ కూతురు కావడంతో ఆ కుటుంబంపై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన టీడీపీ నేతలు సైతం ఆమె కోసం ప్రచారం నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. 
 
ఇదిలావుంటే, సుహాసిని సోదరులైన జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేస్తారా? లేదా అనే దానిపై సందిగ్దం ఏర్పడింది. తన సోదరులిద్దరూ ప్రచారం చేస్తారని సుహాసిని భావించారు. అయితే ఆమె పోటీకి మద్దతిచ్చిన ఎన్టీఆర్ ప్రచారానికి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సుహాసినికి మద్దతుగా ప్రకటన విడుదల చేసిన ఎన్టీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో అంతకంటే ఎక్కువ జోక్యం చేసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
 
నిజానికి ఎన్నికల ప్రచారానికి వచ్చే వ్యక్తుల వివరాలను అభ్యర్థులు లేదా పార్టీలు.. ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు టీడీపీ కానీ మహాకూటమి నేతలు కానీ ఎన్టీఆర్ ప్రచారంపై ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జూ.ఎన్టీఆర్.. అక్క ప్రచారానికి రావడం కష్టమే అని తెలుస్తోంది.