శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (09:35 IST)

నాయినికి మొండిచేయి.. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీ

తెలంగాణ రాష్ట్ర హో మంత్రిగా ఉన్న నాయిని నర్శింహా రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొండిచేయి చూపించారు. ఆయన స్థానంలో కొత్త హోం మంత్రిగా మహమూద్ అలీని నియమించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గురువారం ప్రమాణం చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయనతో పాటు మహమూద్ అలీ కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. అలీకి అత్యంత కీలకమైన హోం శాఖను కేసీఆర్ కేటాయించారు. 
 
ఈయన గతంలో ఉప ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రిగా ఉన్నారు. అలాగే, హోం మంత్రిగా నాయిని నర్శింహా రెడ్డి ఉన్నారు. కానీ, కొత్త ప్రభుత్వంలో అలీకి హోంశాఖను సీఎం కేటాయించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
సీట్ల కేటాయింపు విషయంలో నాయినికి సీఎం కేసీఆర్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తాయి. ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్ కావాలని నాయిని పట్టుబట్టారు. తనకు ఇవ్వకపోయినా తన అల్లుడుకి కేటాయించాలని లేనిపక్షంలో తానే స్వయంగా బరిలోకి దిగుతానంటూ కేసీఆర్‌ వద్ద కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 
 
అయితే, కేసీఆర్ మాత్రం నాయిని హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. తాను నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ముఠా గోపాల్‌కు అధిక విజయావకాశాలు ఉన్నట్టు తేలింది. దీంతో ముషీరాబాద్ టిక్కెట్‌ను ముఠా గోపాల్‌కు కేటాయించారు. ఎన్నికల ఫలితాల్లో కూడా ముఠా గోపాల్ విజయం సాధించాడు. 
 
ఈ నేపథ్యంలో టికెట్ విషయంలోనే నాయిని ఫ్యామిలీని కేసీఆర్ పక్కనబెట్టడం..ఇప్పుడు హోమంత్రి పగ్గాలు కూడా మహమూద్ అలీకి అప్పగించడం చర్చనీయాంశమైంది. అసలు నాయినికి ఈసారి మంత్రి పదవి ఇస్తారా? లేదా? అన్న దానిపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.