శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (12:42 IST)

భార్య మృతి.. ప్రచారానికి దూరం.. అయినా రెబెల్ అభ్యర్థి గెలుపు ఖాయం.. ఎలా?

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పలువురు రెబెల్ (స్వతంత్ర) అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా, అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతల్లో పలువురు టిక్కెట్ల కోసం ఆశపడిభంగపడ్డారు. ఇలాంటివారు రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఇలాంటివారంతా ఇపుడు గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటివారిలో రామగుండం అసెంబ్లీ స్థానం నుంచి తెరాస రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కోరుకంటి చందర్ ఖచ్చితంగా గెలుస్తారనే ప్రచారం సాగుతోంది. 
 
నిజానికి ఈయన 10 రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈయన భార్య కేన్సర్ వ్యాధితో మరణించింది. దీంతో దుఃఖసాగరంలో మునిగిపోయిన చందర్.. ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నారు. అయితే, పోలింగ్‌కు చివరి రెండుమూడు రోజులు మాత్రమే ప్రచారం చేశారు. 
 
వాస్తవానికి గత ఎన్నికల్లోనూ ఈయన రెబెల్ అభ్యర్థిగానే బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో 2,295 ఓట్ల తేడాతో తెరాస అభ్యర్థి సోమారవు సత్యనారాయణ చేతిలో ఓడిపోయారు. ఇపుడు కూడా తెరాస టిక్కెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నించారు. టిక్కెట్ దక్కక పోవడంతో మరోమారు రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
 
దీనికితోడు ఆయన భార్య, 34వ డివిజన్ కార్పొరేటర్ కోరుకంటి విజయ ఇటీవల కేన్సర్ వ్యాధితో కన్నుమూసింది. ఈ సానుభూతితో పాటు గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారన్న సానుభూతి కూడా ఆయనకు కలిసివచ్చింది. అందుకే ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన తప్పకుండా గెలుస్తారనే ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఆయన భవితవ్యం తేలిపోనుంది.