మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కేసీఆర్
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 16 ఫిబ్రవరి 2017 (05:53 IST)

కోర్టులొద్దంటారు పెద్దాయన.. అటూ ఇటూ అభ్యంతరాలే.. ఇది నీటి గొడవ

భూమండలం చుట్టూతా తిరిగి కైలాసానికి తిరిగొచ్చాక ఇప్పటికి తత్వం బోధపడింది అన్నాడట వినాయకుడు. తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా తత్వం ఆలస్యంగా బోధపడినట్లుంది. నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలసి కూర్చొని మాట్లాడుకోవడానికే ప్రాధాన్యతనిస్త

భూమండలం చుట్టూతా తిరిగి కైలాసానికి తిరిగొచ్చాక ఇప్పటికి తత్వం బోధపడింది అన్నాడట వినాయకుడు. తెలంగాణ మఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా తత్వం ఆలస్యంగా బోధపడినట్లుంది.  నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలసి కూర్చొని మాట్లాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తానని సాక్షాత్తూ కేసీఆరే అన్నారంటే తలకు తగిలిన బొప్పెలు ఎంత లోతుగా తగిలాయో అర్థమవుతుంది. కానీ ఒకవైపు పెద్దమనసుతో వ్యవహరిస్తున్నట్లు కనిపించినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు మాత్రం కాస్తంత రాజీకి కూడా సిద్ధపడకుండా మొండిపట్టు పట్టడం గమనార్హం.
 
నీటి పంపకాల కోసం కోర్టుల చుట్టూ తిరగడం కన్నా కలసి కూర్చొని మాట్లాడుకోవడానికే ప్రాధాన్యతనిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కృష్ణానది జలాల పంపకాలపై కేంద్రం ఏర్పాటుచేసిన బజాజ్ కమిటీ బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిసింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ జల వివాదాలు వాంఛనీయం కాదన్నారు. ఇరు రాష్ట్రాలు కలసి మాట్లాడుకోవడం ద్వారా  సమస్య పరిష్కారమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రకారమే నీటిని వాడుకుంటామని చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటిని వినియోగానికి సంబంధించి ఆపరేషన్‌ రూల్స్‌ రూపొందించాలన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి జలాలను సముద్రంలో వృథాగా కలిసిపోకుండా చేయగలిగితే కోస్తా, రాయలసీమ రైతుల అవసరాలు తీర్చవచ్చని చెప్పారు. ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు దిగువ రాష్ట్రాల అవసరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టులు కట్టుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
అంతకుముందు హైదరాబాద్‌ జలసౌధలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో బజాజ్‌ కమిటీ సమావేశం నిర్వహించింది. ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనాలను బజాజ్‌ కమిటీకి విన్నమించారు. తెలంగాణలోని జురాలను ఉమ్మడి ప్రాజెక్టుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ అధికారులు కోరారు. దీనికి తెలంగాణ అధికారులు అంగీకరించలేదు. పులిచింతల, సుంకేశులను ఉమ్మడి ప్రాజెక్టు పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ అధికారులు కోరారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఇరు రాష్ట్రాల వాదనలపై కేంద్రానికి బజాజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది.