పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..
నలుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) సహా 86 మంది మావోయిస్టులు నక్సలిజం హింసాత్మక మార్గాన్ని విడిచిపెట్టి, వారి కుటుంబాలతో ప్రశాంతమైన జీవితాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) మల్టీ జోన్-1, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ముందు లొంగిపోయారని అధికారిక ప్రకటన తెలిపింది. నలుగురు ఏరియా కమిటీ సభ్యులు (ఏసీఎంలు) ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల రివార్డు ఇస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ సూపరింటెండెంట్ బి రోహిత్ రాజు తెలిపారు.
మాజీ తిరుగుబాటుదారులకు అందిస్తున్న సంక్షేమ చర్యల గురించి, అలాగే పోలీసుల 'ఆపరేషన్ చేయూత' కార్యక్రమం కింద గిరిజన (ఆదివాసీ) వర్గాలకు అభివృద్ధి- సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వాత మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు వివిధ కేడర్లకు చెందిన 224 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారని తెలిపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) కాలం చెల్లిన భావజాలంపై పనిచేస్తోందని, గిరిజన ప్రజలలో విశ్వాసం మరియు మద్దతును కోల్పోయిందని గ్రహించిన తర్వాత అల్ట్రాస్ ప్రధాన స్రవంతిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల, రాంపూర్ గ్రామానికి చెందిన ఒక గిరిజన మహిళ తన కాలును కోల్పోగా, సోడిపారా గ్రామానికి చెందిన మరో గిరిజన మహిళ మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాల కారణంగా మరణించారు.
ఈ గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాల మధ్య ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని, అమాయక గిరిజన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందితే వారి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని నమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.
లొంగిపోయి సాధారణ జీవితం గడపాలనుకునే మావోయిస్టులు తమ కుటుంబ సభ్యుల ద్వారా లేదా స్వయంగా సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా జిల్లా అధికారులను సంప్రదించాలని తెలంగాణ పోలీసులు విజ్ఞప్తి చేశారు.