సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారాస ఖాళీ : మంత్రి కోమటిరెడ్డి
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత భారత రాష్ట్ర సమితి ఖాళీ అవుతుందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం హైదరాబాద్ నగరంలో విలేకరులతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు తర్వాత భారాసలో ఎవరూ ఉండరన్నారు. భారాస అధినేత కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదన్నారు.
మంత్రి పదవి రాలేదనే కారణంతోనే అప్పట్లో తెలంగాణ ఉద్యమం చేపట్టారని, అమాయకులను రెచ్చగొట్టారని విమర్శించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో భోజనం చేయాలంటే రూ.లక్ష వసూలు చేసేవారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలంతా సోనియాగాంధీకి రుణపడి ఉండాలని చెప్పిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె కాళ్లు మొక్కారని గుర్తు చేశారు.
'అధికారంలోకి వచ్చాక కేసీఆర్.. చేపలు, గొర్రెల పంపిణీ పేరిట రూ.వేల కోట్లు తిన్నారు. ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయింది. మేడిగడ్డకు మరమ్మతులు చేసినా గ్యారంటీలేదని ఎన్డీఎస్‌ఏ నివేదిక ఇచ్చింది. భారాస చేసిన రైతు రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు వేశారు. 70 వేల మంది టీచర్లు రిటైర్ అయినా డీఎస్సీ నిర్వహించలేదు' అని కోమటిరెడ్డి విమర్శించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామని పునరుద్ఘాటించారు.