ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (13:17 IST)

అక్కినేని అమలకు కౌంటరిచ్చిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

mallu ravi - amala
అక్కినేని అమల వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాగర్‌ కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. రాజకీయ నాయకులందరిపై అక్కనేని అమల చెడు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ నాయకులందరూ నేరస్థుల్లా ప్రవర్తిస్తున్నట్లు ఈ దేశం ఏదో అవుతున్నట్లు స్పందించడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ మానవత్వం గురించి అక్కనేని అమల మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమన్నారు. 
 
రాజకీయ నాయకులపై, రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తక్షణమే ఉపసంహరించుకోవాలని, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌లతో మంత్రి కొండా సురేఖ తీవ్ర అవమానానికి గురయ్యారని, రెండు, మూడు రోజులుగా తీవ్ర కలత చెందిన మంత్రి బాధతో మాట్లాడిన మాటలు అవి అని, బీసీ మహిళ అయిన మంత్రి కొండా సురేఖ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే తీవ్రంగా స్పందించారని తెలిపారు. 
 
కొండా సురేఖ అంత తీవ్రంగా స్పందించడానికి బాధ్యులు ఎవరో తెలుసుకుంటే మంచిదన్నారు. సోషల్‌ మీడియాలో కొండ సురేఖ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేట్లు పెట్టిన పోస్టింగ్‌లపై ఎందుకు బీఆర్‌ఆర్‌ఎస్‌ మహిళ నాయకులు స్పందించలేదని ఆయన నిలదీశారు.