హాస్టల్లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. హాస్టల్‌లో ఉండేందుకు ఇష్టంలోని ఓ విద్యార్థిని అదే హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం విఠలాపురానికి చెందిన ఊరబావి పరశురాముడు, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె (10) ఈ ఏడాది తుఫ్రాన్ పేటలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఐదోతరగతిలో సీటు సాధించింది. జూన్ నెలలో గురుకులంలో చేరిన విద్యార్థిని హోమ్ సిక్ సెలవులకు ఇంటికి వెళ్లి ఆదివారం తిరిగి గురుకులానికి వచ్చింది.
సోమవారం తెల్లవారుజామున బాలిక కనిపించడంలేదని వెతకగా.. గురుకుల భవనం నాలుగో అంతస్తు పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు వసతి గృహం అధికారులు గుర్తించారు. విద్యార్థినికి హాస్టల్లో ఉండటం ఇష్టం లేకే ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెబుతుండగా.. తమ కుమార్తె ఇష్టంతోనే వచ్చిందని, ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుందని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఇతర అధికారులు గురుకులం వద్దకు చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. తమ సొసైటీ నుంచి పరిహారం కింద రూ.3 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని శ్యాంప్రసాద్ హామీ ఇచ్చారు.
రూ.2 లక్షల పరిహారం అందిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. అంత్యక్రియల ఖర్చు నిమిత్తం తక్షణ సాయం కింద రూ.20 వేలు అందించారు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు.