గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (09:17 IST)

నేటి నుంచి గ్రూపు-1 పరీక్షలు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Exam
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం నుంచి గ్రూపు-1 పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 563 గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం ఈ రాత పరీక్షను నిర్వహిస్తుంది. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేయాలనంటూ పలువురు నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్ కమిషనరేట్ పరిధిలోని 46 పరీక్షా కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
ముఖ్యంగా, రాత పరీక్ష జరిగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకూడదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ సహా ఆరుగురు పోలీసులు ఉంటారు. అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.
 
కాగా, ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీపీఎస్ఈ కొన్ని నిబంధనలు విధించింది. అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ తనిఖీ చేశాక పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. హాల్ టికెట్‌లో పేర్కొన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇన్విజిలేటర్లు కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.
 
అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ రంగు బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలి. బొమ్మలు పెన్సిల్ లేదా పెన్నుతో వేయాలి. జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించవద్దు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఒకే హాల్ టికెట్‌ను ఉపయోగించాలి. హాల్ టికెట్‌పై పేర్కొన్న స్థలంలో రోజూ అభ్యర్థితో పాటు ఇన్విజిలేటర్ సంతకం చేయాలి. జవాబులు రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు. 
 
అభ్యర్థి ఎంపిక చేసుకున్న భాషలోనే సమాధానాలు రాయాలి. వేర్వేరు భాషల్లో రాస్తే ఆ జవాబు పత్రాలను టీజీపీఎస్సీ అనర్హమైనవిగా గుర్తిస్తుంది. పరీక్ష రాయడానికి సహాయకులు అవసరమైన దివ్యాంగ అభ్యర్థుల హాల్ టిక్కెట్లపై 'స్కైబ్' విషయాన్ని పేర్కొంటారు. దివ్యాంగుల కోసం 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీరు సదరు ధ్రువపత్రం తీసుకురావాల్సి ఉంటుంది.