శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 30 జులై 2024 (16:26 IST)

హైదరాబాద్: ట్రీట్ ఇవ్వమని తీసుకెళ్లి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం

police
సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది కదా... నాకు ట్రీట్ ఇవ్వవా అంటూ చిన్ననాటి స్నేహితుడు అడగ్గానే ఆమె అతడికి పార్టీ ఇచ్చినందుకు అదే అదనుగా దారుణానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కలిసి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాదులోని వనస్థలిపురంలో ఓంకార్ నగర్ బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్ హోటల్ గదిలో జరిగింది.
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... యువతి చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడు ఆమెకి ఉద్యోగం వచ్చినందుకు ట్రీట్ ఇవ్వాలన్నాడు. అందుకు ఆమె అంగీకరించి ఓంకార్ నగర్‌లో వున్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కి అతడితో పాటు వచ్చింది. అక్కడ బార్‌లో యువతిని కూడా మద్యం సేవించాలని ఒత్తిడి చేయడంతో ఆమె మద్యం తాగింది. ఆ తర్వాత హోటల్ గదికి తీసుకుని వెళ్లాడు. ఆమె మత్తులోకి జారుకోగానే అప్పటికే మరో స్నేహితుడిని పిలిచిన గౌతం రెడ్డి ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
స్పృహ వచ్చిన వెంటనే బాధితురాలు కేకలు పెట్టింది. ఆ కేకలు విని హోటల్ సిబ్బంది అక్కడికి వెళ్లడంతో గదిలో వున్న ఇద్దరు యువకులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు రక్తపు మడుగులో వుండటాన్ని చూసిన సిబ్బంది ఆమె ఐడీ చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.