బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 డిశెంబరు 2023 (11:48 IST)

గురి తప్పింది... వందే భారత్ అద్దం పగిలింది

vande bharat express
గుల్లేరు గురి తప్పింది. పిట్టను కొట్టబోతే వందే భారత్ రైలు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో జరిగింది. దీంతో ఈ ఘటనకు కారణమైన హరిబాబును అరెస్టు చేశారు. అయితే, తాను ఉద్దేశ్యపూర్వకంగా వందే భారత్ రైలు అద్దాన్ని పగలగొట్టలేదని, గుల్లేరు గురితప్పి వందే భారత్ రైలు అద్దానికి తగిలి పగిపోయిందని ఆయన వివరణ ఇచ్చినప్పటికీ ఖాజీపేట్ రైల్వే పోలీసులు మాత్రం వినిపించుకోలేదు. 
 
పోలీసు కథనం మేరకు.. జనగామకు చెందిన హరిబాబు (60) అనే వ్యక్తికి పిట్టలను కొట్టి, వాటిని ఆహారంగా తీసుకునే అలవాటు ఉంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జనగామ సమీపంలో గుల్లేరుతో పిట్టలను కొట్టే క్రమంలో అది గురితప్పింది. అదే సమయంలో విశాఖపట్టణం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును తాకింది. దీంతో ఆ రైలు అద్దం కాస్త పగిలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో గుల్లేరుతో కొట్టింది హరిబాబేనని తేలింది. 
 
దీంతో ఆయనను శనివారం అరెస్టు చేశారు. ఆయన ఉపయోగించే గుల్లేరును కూడా స్వాధీనం చేసుకున్నారు. తన అరెస్టుపై హరిబాబు స్పందిస్తూ, తాను రైలుకు గురిపెట్టలేదని, పిట్టను కొట్టబోతే గురితప్పి... అది రైలును తాకిందని, ఇందులో తన తప్పేమి లేదని చెప్పాడు. అయితే, రైల్వే పోలీసులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా హరిబాబును అరెస్టు చేశారు.