గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2024 (11:04 IST)

ట్యాంకులో పడి కోతులు మృతి!! నల్గొండ జిల్లాలో విషాదం!

monkey
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటి ట్యాంకులో పడి 30 కోతులు ప్రాణాలు కోల్పోయాయి. నీరు తాగడానికి వచ్చిన ఈ కోతులు వాటర్ ట్యాంకులో పడిపోవడంతో చనిపోయాయి. అవన్నీ ఉబ్బిపోయి ఉన్నాయి. దీంతో పది రోజుల క్రితమే అవి చనిపోయివుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ సమీపంలోని 200 కుటుంబాలకు ట్యాంకు ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇపుడు ఇదే ట్యాంకులో కోతులు చనిపోయాయి. దీంతో ఈ ట్యాంకు నుంచి సరఫరా అయిన నీటిని తాగిన కుటుంబాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్యాంకులో ఏదీ పడకుండా అధికారులు గతంలో మెటల్ షీట్స్ ఏర్పాటు చేశారు. అయితే, ఎండలు మండిపోతుండటంతో కోతులు దాహాన్ని తట్టుకోలేక షీట్స్ తప్పించి ట్యాంకులోకి దిగివుంటాయని భావిస్తున్నారు. అవి మళ్లీ బయటకురాలేక అందులోనే పడి చనిపోయివుంటాయని అంటున్నారు. 
 
ట్యాంకులో భారీ సంఖ్యలో కోతుల కళేబరాలు బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితమే అవి మరణించి వుంటాయని అనుమానిస్తున్నారు. తమ ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.