మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 4 ఆగస్టు 2025 (20:17 IST)

గచ్చిబౌలిలో తాటిచెట్టుపై పడిన పిడుగు, పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? ( video)

Lightning strikes a palm tree
తొలకరి వానలు మొదలయ్యాక అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ వుంటాయి. ఈ వానలతో పాటు చెవులు చిల్లులు పడేలా పిడుగులు కూడా పడుతుంటాయి. తాజాగా హైదరాబాదులోని గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని ల్యాంకోహిల్స్ సర్కిల్ వద్ద హెచ్‌పి పెట్రోల్ బంకుకి ఎదురుగా వున్న తాటిచెట్టుపై పిడుగు పడింది. దీనితో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
 
పిడుగులు పడుతున్నప్పుడు ఏం చేయాలి?
ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే. కారులో ఉంటే అందులోనే ఉండటం ఉత్తమం. పొలాల్లో పనిచేసే రైతులు ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలి. భూమి పొడిగా ఉన్న చోటుకి వెళ్లాలి. చెట్ల కిందకు, టవర్ల కిందకు వెళ్లకూడదు. సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకూడదు. ఒకవేళ తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకుని కూర్చోవాలి. దాంతో ఆ పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మన మీద తక్కువగా పడే అవకాశం ఉంటుంది. భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి.
 
ఒకవేళ నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వెళ్లాలి. ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలి. ఉరుములతో కూడిన వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిస్తే బయటకు వెళ్లకుండా పనులను వాయిదా వేసుకోవాలి. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు స్నానం చేయడం, పాత్రలు కడగటం ఆపేస్తే మంచిది. ఎందుకంటే లోహపు పాత్రలు, పైపుల ద్వారా ఒక్కసారిగా పెద్దమొత్తంలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉంటుంది.
 
పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై రెండు చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్లీ బయటకు వెళ్లిన చోట(ఎక్కువగా అరికాళ్లపై) గాయాలు అవుతాయి. బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెబుతుంటారు. కానీ అందులో నిజం లేదు. బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించాలి.