మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ బాధాకరం : బీజేపీ ఎంపీ రఘునందన్
తెలంగాణ మంత్రి కొండా సురేఖను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం ఎంతో బాధాకరమని బీజేపీకి చెందిన మెదక్ ఎఁపీ రఘునందన్ రావు అన్నారు. ఇలాంటి పాడుపనికి పాల్పడింది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ, భారస నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని విమర్శించారు.
'కేవలం ఒక ట్వీట్ పెట్టడం కాదు.. ట్రోలింగ్‌పై హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే.. దారుణంగా పోస్టులు పెడతారా? కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ, భారాస ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎంపీగా నేను ఉన్నాను.
వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని బూతద్దంలో చూపించి.. విమర్శలు చేసే వారిని చూస్తే బాధనిపిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలి. ట్రోలింగ్ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. అక్కకు మద్దతుగా ఒక న్యాయవాదిగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా' అని రఘునందన్‌రావు తెలిపారు.