శనివారం, 18 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (10:23 IST)

కలెక్టరుపై దాడి వెనుక భారీ కుట్ర : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ponguleti srinivasa reddy
వికారాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్, ప్రభుత్వ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారంటే దాని వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందనే విషయం అర్థమవుతోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో అమాయకులైన రైతులను రెచ్చగొట్టి భారత రాష్ట్ర సమితి నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తొమ్మిదేన్నరేళ్ళపాటు అధికారంలో ఉన్న భారాస నేతలు ఇపుడు అధికారం కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. అందుకే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వ అస్థిరత, శాంతిభద్రత ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 
భారాస నేతల చిల్లర, అవకాశవాద రాజకీయాలతో ఎంతోకాలం మనుగడ సాగించలేరన్నారు. పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలి చేయడం సరికాదన్నారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై దాడి దారుణం అన్నారు. రైతుల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
 
రైతుల ముసుగులో అధికారులపై దాడి చేసి చంపే ప్రయత్నం సరికాదన్నారు. ఈ ఘటనను తమ ప్రభుత్వం సీరియస్‌‍గా తీసుకుందన్నారు. ఇప్పుడు అధికారులపై దాడి చేసిన వాళ్లు తర్వాత ప్రజలపై, నాయకులపై దాడి చేయరనే గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. రైతుల ముసుగులో గులాబీ గూండాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు.