గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 జనవరి 2024 (18:03 IST)

కొత్త ఆఫీసులో కొబ్బరికాయ కొట్టిన స్మితా సభర్వాల్, సమస్యల పరిష్కారం కోసం సంప్రదించగలరు

smita sabharwal
కర్టెసి-ట్విట్టర్
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన స్మితా సభర్వాల్ ఈరోజు ఆఫీసులో కొబ్బరికాయ కొట్టి, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పంజాగుట్ట రోడ్డులోని ఎర్రమంజిల్ లో చాలా చిన్న ఆఫీసు వుందనీ, అక్కడికి తెలంగాణ రాష్ట్రంలోని పంచాయితీ రాజ్ శాఖలో పని చేస్తున్న సర్పంచ్‌లు వారి యొక్క సూచనలు, సమస్యలు కోసం కలవడానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం రాగలరని ఎక్స్‌లో పోస్ట్ చేసారు.
 
తెలంగాణ రాష్ట్రంలో గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి, చాలా కాలం పాటు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌. ఇటీవలే 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో స్మితా సభర్వాల్ కూడా ఉన్నారు. అమెకు అప్రాధాన్య పోస్టును కేటాయించారన్న వాదన వినిపిస్తోంది. ఈ పోస్టు డిప్యూటీ కలెక్టర్ కంటే తక్కువ స్థాయి పోస్టు. 
 
గత భారస ప్రభుత్వంలో స్మితా సభర్వాల్... సీఎంవో కార్యదర్శిగా, ఆ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన మిషన్‌ భగీరథకు, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగానికి అదనపు బాధ్యతలనూ నిర్వహించారు. సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రజత్‌కుమార్‌ పదవీ విరమణ చేయగానే.. ఆ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇలా కీలకమైన బాధ్యతలు నిర్వహించి, ముఖ్యమైన అధికారిణిగా ఓ వెలుగు వెలిగారు. 
 
కానీ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్మితా సభర్వాల్‌ విషయంలో కొన్ని వివాదాస్పద వార్తలు వెలువడ్డాయి. ఆమె కేంద్ర సర్వీసులకు వెళతారన్న ప్రచారం జరిగింది. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశానికి ఆమె డుమ్మా కొట్టారు. ఇది పెద్ద వివాదాస్పదమైంది. ఆ నేపథ్యంలో స్మితా సభర్వాల్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా ఓ ప్రకటన చేశారు. తాను కేంద్ర సర్వీసులకు వెళ్లడం లేదని, కొత్త ప్రభుత్వం ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని, తెలంగాణ రాష్ట్ర కేడర్‌ అధికారిణిగా గర్విస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. 
 
కానీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆమె పట్ల మొదటి నుంచీ కొంత ఆగ్రహంతోనే ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఈసారి వేటు వేసి, ఎలాంటి ప్రాధాన్యం లేని రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్య కార్యదర్శిగా నియమించారన్న వాదన వినబడుతోంది. నిజానికి ఇది డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి పోస్టు. గ్రామ పంచాయతీలకు నిధులను సిఫారసు చేయడం తప్ప.. ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. ఎవరినైనా లూప్‌లైన్‌లో పెట్టాలంటే ఇలాంటి పోస్టుల్లో నియమిస్తారన్న ప్రచారం వుంది. ఇప్పుడు స్మితా సభర్వాల్‌ను కూడా ఈ స్థానంలోకి పంపించడం ద్వారా లూప్‌లైన్‌లో పెట్టినట్టేననే చర్చ ఐఏఎస్ వర్గాల్లో సాగుతుంది.