శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 డిశెంబరు 2023 (19:54 IST)

ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

revanth in kcr hospital
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఉన్న యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను రేవంత్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. అలాగే, మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని మాజీ మంత్రి కేటీఆర్‌, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి వెలుపల మీడియాతో సీఎం మాట్లాడారు.
 
'కేసీఆర్‌ను పరామర్శించాను.. క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించా. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షిస్తున్నాం. మంచి ప్రభుత్వ పాలన అందించడానికి ఆయన సూచనలు అవసరం ఉంది. ప్రజల పక్షాన అసెంబ్లీలో కేసీఆర్‌ మాట్లాడాల్సిన అవసరముంది. త్వరగా కోలుకుని అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కేసీఆర్‌ను కోరా' అని చెప్పారు.
 
కాగా, కేసీఆర్ దగ్గర కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో వెంట మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 20 నిముషాలపటు ముఖ్యమంత్రి యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు. మాజీ సీఎం హోదాలో కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని మరోసారి డాక్టర్లకు సూచించారు. 
revanth - kcr
 
గురువారం అర్థరాత్రి ఎర్రవల్లి నివాసంలోని బాత్‌రూంలో కేసీఆర్‌ జారిపడటంతో ఎడమ తుంటికి తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శుక్రవారం రాత్రి తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న వైద్యులు శనివారం వాకర్‌ సాయంతో నెమ్మదిగా అడుగులు వేయించారు. అయితే, కేసీఆర్ పూర్తిగా కోలుకునేందుకు కనీసం 8 వారాల సమయం అంటే రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.