చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదని, వారిద్దరూ సహచరులేనని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు చెప్పారని చెప్పారు. చంద్రబాబు ఏపీ సీఎంగా, రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్నారన్నారు. వారిద్దరి మధ్య గురుశిష్యుల సంబంధం ఉందని చెప్పేవారివి అవగాహన లేని మాటలు అన్నారు.
తమ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఇచ్చిన గడువు కంటే ముందుగానే అమలు చేశామని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఒక లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ఐదేళ్లు అయినా హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కానీ ఇప్పుడు మాత్రం రుణమాఫీ ఎప్పుడు చేస్తారని తమను అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతుబంధును తాము రైతుభరోసాగా మార్చినట్లు చెప్పారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీలో తమ సొంత నిర్ణయాలు ఉండవని స్పష్టంచేశారు. ప్రజలు కట్టిన పన్నులతోనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కట్టిన ప్రతి పైసా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాలన్నారు. సంపదను సృష్టించి ప్రజలకు పంచాలనేదే తమ ఆలోచన అన్నారు.