బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (19:45 IST)

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం.. అమలు ఎప్పటి నుంచంటే...

sand digging
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకకు ధర నిర్ణయించి విక్రయించారు. అయితే, టీడీపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం మాత్రం అర్హులైన పేదలకు ఉచితంగానే ఇసుకను సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ ఉచిత ఇసుక విధానాన్ని కూడా ఈ నెల 8వ తేదీ నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేళ్ళ క్రితం నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చపేట్టాలని రాష్ట్ర గనుల శాఖామంత్రి కొల్లు రవీందరకు సీఎం బాబు ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించిన కలెక్టర్ల అధ్యక్షత కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలను నిర్ణయించాలని ఆదేశించారు. 
 
ఇసుక విధానంతో ఐదేళ్లుగా పేద ప్రజలను వైకాపా ప్రభుత్వం దోచుకుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఉచిత ఇసుక పంపిణీ విధి విధానాలను తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టిసారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయవనరుగా మార్చుకుందని చెప్పారు. 
 
అదేసమయంలో ఉచిత ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు కూడా చూసుకుంటామన్నారు.