గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (22:38 IST)

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

Wall Collapse
Wall Collapse
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ ఎల్బీనగర్‌ డివిజన్ మన్సురాబాద్ సైట్ నెం. 59లో వాణిజ్య నిర్మాణం కోసం సెల్లార్‌లో తవ్వకాలు చేస్తుండగా గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. 
 
ఈ సెల్లార్ గోడ కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, తండ్రి, కొడుకు, బామ్మర్ది మృతి చెందారు. మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ఖమ్మం జిల్లా సీతారామాపురం తండా వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 
 
బుధవారం సెల్లార్‌లో సుమారు 10 మంది కార్మికులు తవ్వకాలు చేపట్టగా మట్టి పెళ్లలు కూలి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీశారు. 
ఈ ఘటనపై జీహెచ్ఎంసీ తీవ్రంగా స్పందించింది. సరైన జాగ్రత్తలు పాటించకుండా సెల్లార్ తవ్వకం ప్రారంభించడం వల్లే గోడ కూలినట్లు జీహెచ్ఎంసీ నిర్ధారించింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడం, ప్రాణ నష్టానికి కారణాలపై యజమానికి షోకాజు నోటీసులు జారీ చేయడంతో పాటు భవన నిర్మాణ అనుమతులు రద్దు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.