మా 7 ఎకరాల పొలం, ఇల్లు ఫార్మాకి తీసుకుంటే మేం ఎక్కడ బతకాలి రేవంతన్న: లగచర్ల బాధితురాలు
తెలంగాణలోని కొడంగల్ పరిధిలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి అనుమతులు ఇవ్వడంపై లగచర్ల గ్రామస్తులు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. తమ భూములను ఫార్మా కంపెనీలకు ఇవ్వాలంటూ బలవంతం చేస్తున్నారనీ, మాట వినని వారిని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఓ బాధిత మహిళ మాట్లాడుతూ... రేవంతన్న ఇలా ఎందుకు చేస్తున్నారు. ఇంత మంచి భూమిలో తొండలు గుడ్లు పెడుతున్నాయని ఆయన ఎలా అంటారు.
చూడండి మా గ్రామంలోని భూములు ఎంత పచ్చగా వున్నాయో. ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే కాలుష్యం తప్ప ఏం ఉపయోగం లేదు. ఫార్మా కంపెనీ వల్ల ఉపయోగం ఉంటే మా భూములు మేమే ఇచ్చేస్తాం. మాకు 7 ఎకరాల పొలం వుంది ఇక్కడ. ఈ భూములు పోతే మేము ఎలా బ్రతకాలి. సిటీకి పోతే కనీసం ఏడెనిమిదివేలు ఇంటి అద్దె వుంది. అక్కడ మేము ఏం సంపాదించి మా పిల్లల్ని ఎలా బ్రతికించగలము. కొన్ని రోజుల కిందట మా మామయ్యను తీసుకెళ్లారు. 12 రోజుల కింద మా ఆయన ఎటో వెళ్లిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలీదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయనను పోలీసులు తీసుకెళ్లారా లేదంటే ఏమయ్యాడో తెలియడంలేదు.
మా బంధువులకు ఫోన్ చేస్తే మా ఇంటికి రాలేదని చెబుతున్నారు. సన్ సిటీలో వుండేవాళ్లం. ఫ్రీ బస్ వచ్చిన దగ్గర్నుంచి మా ఆయన నడిపే ఆటోకి బేరం రావడంలేదు. ఏదో ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుని బతుకుతుంటే ఇప్పుడు అది కూడా లాగేసుకుంటే మేం ఎక్కడ బతకాలి'' అంటూ లగచర్ల బాధితురాలు వాపోయింది.