శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (09:07 IST)

హైదరాబాద్‌లో అర్థరాత్రి ఘోరం.. గోడకూలి 9 మంది మృతి

హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మంగళవారం రాత్రి ఘోరం జరిగింది. చాంద్రాయణగుట్ట మహ్మదీయ హిల్స్‌లో మంగళవారం అర్థరాత్రి ప్రహరీ గోడ కూలి 9 మంది దుర్మరణం పాలయ్యారు. 
 
మహ్మదీయహిల్స్‌లో ఓ కాంపౌడ్‌ వాల్‌ కూలి ఐదు ఇండ్లపై పడింది. దీంతో ఒక ఇంట్లో ఉన్న ఐదుగురు, మరో ఇంట్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ రెస్క్యూ టీం సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. రాత్రి 12.30 గంటల సమయంలో ఒక మృతదేహాన్ని వెలికితీశారు. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. 
 
మరోవైపు, భారీ వర్షాలతో ముంపునకు గురైన కాలనీల ప్రజలకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. ఎలాంటి అధైర్యానికి గురికావద్దని చెప్పారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌లోని స్నేహమయినగర్‌, గాంధీనగర్‌, అఖిలాండేశ్వరినగర్‌, పీవీఆర్‌ కాలనీల్లో కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్నతో కలిసి పర్యటించారు. మురుగు, వరద నీటిలో పాదయాత్ర చేశారు. 
 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఊహించని విధంగా వస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పై కాలనీల నుంచి వచ్చిన వరదతో ముంపు తప్పడం లేదన్నారు. ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు. బుధవారం కూడా వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.