శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (08:43 IST)

నీట మునిగిన భాగ్యనగరం .. కుండపోత వర్షంతో అస్తవ్యస్తం

భాగ్యనగరం కనిపించకుండా పోయింది. అంటే.. జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ మహానగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా, మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం దెబ్బకు అన్ని ప్రాంతాల నీట మునిగాయి. దీంతో మహానగర వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. 
 
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం... మంగళవారం ఉదయం ఉత్తర కోస్తా ప్రాంతంలోని కాకినాడ - నర్సాపూర్ వద్ద తీరం దాటిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఇది విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ప్రయాణించడంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 
 
ఫలితంగా భాగ్యనగరంలోని అన్ని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అనేక సెల్లార్లలోకి నీరుకూడా ప్రవేశించింది. ఎప్పుడూ వరద నీరు రాని ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. అన్ని నాలాలూ పొంగి పోర్లుతున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి రెండు నుంచి మూడు అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోంది. 
 
ప్రధానంగా ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, మూసారం బాగ్, మలక్ పేట, కోటి, చాంద్రాయణగుట్ట, లంగర్ హౌస్, మెహిదీపట్నం, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, మాదాపూర్, తార్నాక, మల్కాజ్ గిరి తరితర ప్రాంతాల్లో పరిస్థితి భీతావహంగా మారింది.
 
రాత్రంతా చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. విద్యుత్ సబ్ స్టేషన్లలోకి వరద నీరురావడంతోనే ముందు జాగ్రత్తగా కరెంట్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.