సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (13:52 IST)

తీవ్ర వాయుగుండంగా అల్పపీడనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వచ్చే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
ఈ తీవ్ర వాయుగుండం నరసాపురం, విశాఖ మధ్య రేపు రాత్రికి తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం వాయుగుండం విశాఖకు ఆగ్నేయంగా 430 కిమీ ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
నేడు, రేపు తీరం వెంబడి గాలుల వేగం 70 కిమీ వరకు ఉండొచ్చని, సముద్రంగా అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన పిమ్మట, ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వివరించారు. అటు తెలంగాణలోనూ వాయుగుండం ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. 

మరోవైపు, హైదరాబాద్‌‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. షేక్‌పేట, మణికొండ, గోల్కొండ, ఫిలిమ్‌నగర్, బంజరాహిల్స్, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, కొంపల్లి, దుండిగల్‌, శేరి లింగంపల్లి, చందానగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.  పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మ్యాన్‌హోల్స్ ద్వారా నీటిని పంపేందుకు సిబ్బంది చర్యలు చేపడుతున్నారు. 
 
కాగా, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం వరకు అత్యధికంగా దుబ్బాకలో 82 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి,  నారాయణపేట, వికారాబాద్‌, రంగారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, కుమ్రంభీం, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లిల్లోని పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.