శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (08:03 IST)

చెరుకు రైతులకు నష్టం జరక్కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు: మంత్రి హరీష్ రావు

చెరుకు  రైతులకు ఎలాంటి నష్టం జరక్కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. జహీరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో  చెరుకు రైతులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యలు, ట్రైడెంట్ చక్కెర పరిశ్రమ చెల్లించాల్సిన బకాయిలు, ఈ సంవత్సరం క్రషింగ్ నకు సంసిద్ధత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రైడెంట్ పరిశ్రమ యాజమాన్యంతో ఎప్పుడూ సమస్య వస్తుందని,అది చెరుకు సాగు పై ప్రభావం పడుతుందన్నారు .గత సంవత్సరం 1400 మంది రైతులకు  రూ.12.70 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, గత నాలుగు నెలలుగా చాలాసార్లు యాజమాన్యంతో సమావేశమై మాట్లాదినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉందని అన్నారు. ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లించడం లేదని క్రషింగ్ చేయడానికి సిద్ధంగా లేరన్నది  స్పష్టమైందన్నారు.
 
పరిశ్రమపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సంవత్సరం సాగులో ఉన్న మూడు లక్షల ఎకరాలలో వున్న చేరుకును ఏ విధంగా క్రషింగ్ చేయాలన్నది, రైతుల అంగీకారంతో అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.
 
ట్రైడెంట్ పరిశ్రమ పై చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. జహీరాబాద్ చెరుకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా గణపతి ,మాగి చక్కెర ఫ్యాక్టరీలకు టై ఆప్ చేసుకుని క్రషింగ్ చేయడానికి అనుమతి ఇస్తామని మంత్రి పేర్కొన్నారు.

చెరకు క్రషింగ్ ఈనెల 20 నుండి మొదలయ్యే అవకాశం ఉందన్నారు. గణపతి యాజమాన్యము క్రషింగ్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మంత్రికి తెలిపారు. ఎంత వీలైతే అంత క్రషింగ్ చేయడానికి తీసుకోవాలని  మంత్రి గణపతి ఫ్యాక్టరీ వారికి సూచించారు.
 
జిల్లాలోనే క్రషింగ్ అవుతున్నందున జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని ,రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఈ సంవత్సరం నిర్ణయమైన ధర మేరకు తీసుకోవాలని వారికి సూచించారు. ఈనెల 20 నుండి  పూర్తిస్థాయిలో క్రషింగ్ జరగాలన్నారు.
 
సమావేశంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, శాసనసభ్యులు మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సి డి సి చైర్మన్ ఉమాకాంత్ పా టిల్, కేన్ కమిషనర్ రవీందర్ ,జహీరాబాద్ నియోజకవర్గ చెరుకు రైతులు తదితరులు పాల్గొన్నారు.