శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

అమెరికాలో తుపాకీ మిస్ ఫైర్... తెలంగాణ విద్యార్థి మృతి

gunshot
అమెరికా దేశంలో జరిగిన ఓ విషాదకర ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి ఒకరు చనిపోయారు. తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి ప్రాణాలు విడిచారు. 
 
ఈ జిల్లాలోని మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్‌సాయి అనే విద్యార్థి ఎంఎస్‌ చదివేందుకు 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. అలబామాలోని అబర్న్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అలాగే, తన ప్యాకెట్ మనీ కోసం సమీపంలోని ఓ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ కూడా చేస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌లోని సెక్యూరిటీ గార్డు వద్ద తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో అది మిస్‌ ఫైర్‌ అయింది. అందులోని బుల్లెట్ ఒకటి బయటకు దూసుకొచ్చి అఖిల్‌ సాయి తలలోకి దూసుకెళ్లింది. 
 
దీంతో ఇతర సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల్‌ మృతిచెందాడు. అఖిల్‌ సాయి మృతిపై కుటుంబసభ్యులకు సమాచారం అందింది.