ఇరాన్‍లో భారీ భూకంపం - ఏడుగురు మృతి  
                                       
                  
                  				  ఇరాన్ దేశంలో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఇందులో ప్రాథమిక సమాచారం మేరకు ఏడుగురు చనిపోగా మరో 400 మంది వరకు గాయపడ్డారు. ఇరాన్‌లోని అంజర్ బైజాన్ ప్రావిన్స్‌లో కోయ్ నగరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలు మీద పడటంతో కొందరు మరణించారు. ఈ శిథిలాలు పైన పడకుండా తప్పించుకునే క్రమంలో పలువురు గాయపడ్డారు. అనేక మంది భవనాలపై నుంచి కిందకు దూకారు. 
				  											
																													
									  
	 
	ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా ఉంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.