గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (19:48 IST)

హైదారాబాద్‌కు ఆ పేరు తెచ్చిపెట్టిన బిర్యానీ.. గుర్తించింది ఎవరో తెలుసా? (video)

హైదరాబాద్ బిర్యానీ ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసింది. సాధారణంగా హైదరాబాద్ అంటే టక్కున మనకు గుర్తొచ్చేది బిర్యానీనే. మన తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాలకు హైదరాబాద్ వంటల రుచి వ్యాప్తి చెందింది. అదే ప్రస్తుతం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. బిర్యానీ, హలీం, ఇరానీ ఛాయ్ అంటూ ప్రత్యేక వంటకాలు హైదరాబాదులో లభిస్తాయి. 
 
దేశ, విదేశాలకు చెందిన అనుభవజ్ఞులైన చెఫ్‌లను నిజాం నవాబులు హైదరాబాద్‌కు రప్పించారు. కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలతో పాటు సౌదీ అరేబియా, ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల ఫుడ్ వెరైటీస్ ఇక్కడి ప్రజలకు పరిచయం చేశారు. 
 
అందుకే భాగ్య నగరంలో అన్నిరకాల వెరైటీలు కనిపిస్తూ జిహ్వ చాపల్యాన్ని తీరుస్తుంటాయి. భిన్న వర్గాలు, విభిన్న మతాలకు నెలవైన తెలంగాణ రాజధాని నగరంలో అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ.. ఎంతో కాలంగా మినీ భారత్‌గా హైదరాబాద్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకు చెందిన అన్ని రకాల ఆహార పదార్థాలు దొరికే ఏకైక నగరంగా హైదరాబాద్‌ను గుర్తించింది యునెస్కో. క్రియేటివ్ సిటీల జాబితాలో హైదరాబాదును చేరుస్తూ సర్టిఫికేట్ ఇచ్చింది. 
 
ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. హైదరాబాదును యునెస్కో క్రియేటివ్ సిటీ జాబితాలో చేర్చిందని ప్రకటించారు. ఈ జాబితాలో దేశంలోని రెండు నగరాలకే చోటు దక్కిందని అందులో ఒకటి దేశ వాణిజ్య రాజధాని ముంబై కాగా, రెండో హైదరాబాద్ అంటూ తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌‌కు అభినందనలు తెలిపారు.