ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 4 నవంబరు 2020 (09:21 IST)

ధరణి పోర్టల్‌ వివరాలపై హైకోర్టు స్టే

ధరణి పోర్టల్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలను కూడా నమోదు చేస్తోంది.. ఇప్పటికే చాలా వరకు ఈ వివరాలను సేకరించారు.. అయితే.. ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాల నమోదుపై స్టే విధించింది తెలంగాణ హైకోర్టు.

ధరణి పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు ఆ పోర్టల్‌లో నమోదు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.. భద్రతాపరమైన నిబంధనలు పాటించుకుండా వ్యవసాయేతర భూముల వివరాలు నమోదు చేయడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి.

గూగుల్ ప్లై స్టోర్‌లో ధరణి పోర్టల్‌ను పోలిన మరో నాలుగు యాప్స్‌ ఉన్నాయని.. దీంతో అసలు ధరణి పోర్టల్‌ ఏదో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యానించింది.
 
నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీలకు సంబంధించిన ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. మరోవైపు, వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దనని పేర్కొంది.

ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు.. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని.. కొత్త రెవెన్యూ చట్టంలో వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుంది?..

వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదని వ్యాఖ్యానించింది.. డేటా దుర్వినియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే, డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు అడ్వొకేట్ జనరల్.. కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కోరారు. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది.