శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 22 నవంబరు 2023 (13:02 IST)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - అడ్డదారుల్లో రూ.కోట్ల నగదు సంచులు తరలింపు...

cash
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో డబ్బులు పంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో డబ్బు పంపిణీ సాఫీగా సాగడంలేదు. దీంతో అడ్డదారుల్లో ఓటర్లకు డబ్బును చేరవేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సైతం బెడిసి కొడుతున్నాయి. దీంతో కోట్లాది రూపాయలను పోలీసులు పట్టుకుంటున్నారు.
 
మొన్నటికిమొన్న అప్పా జంక్షన్ వద్ద రూ.7.4 కోట్లు.. తాజాగా పంజాగుట్ట గ్రీన్ ల్యాండ్ కూడలిలో రూ.97.30 లక్షలు.. మరో రెండు సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి చేరిన రూ.8 కోట్లను గుర్తించారు. ఈ బ్యాంకు లావాదేవీలను నిలిపివేశారు. ఇలా పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ రాజధానిలో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. వారం వ్యవధిలో సుమారు రూ.18 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నారు. 
 
అభ్యర్థులు నగదు, ఇతర తాయిలాల పంపిణీకి సిద్ధమయ్యారనే సమాచారంతో ఫ్లయింగ స్క్వాడ్, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లోని గోదాములు, పరిశ్రమలు, వ్యవసాయ క్షేత్రాల్లో భారీగా నగదు భద్రపరిచారనే ఫిర్యాదులతో.. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల ఫామ్ హౌస్లపై నిఘా ఉంచారు. 
 
అడ్డదారుల్లో సొమ్ము తరలింపు.. ఓట్లు రాబట్టేందుకు పలుచోట్ల అభ్యర్థులు నోట్ల కట్టలను దించుతున్నారు. గ్రేటర్ పరిధిలోని కీలక నియోజకవర్గాలో నెలకొన్న గట్టిపోటీ దృష్ట్యా కొన్ని పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో నగదు గోదాములకు చేర్చినట్టు సమాచారం. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మీదుగా అంబులెన్స్‌ల్లో, మినీలారీల ద్వారా డబ్బు సంచులను చేరవేస్తున్నట్టు సమాచారం.