గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (18:07 IST)

భార్యాభర్తల పంచాయతీ.. కళ్లల్లో కారం కొట్టేంతవరకు వెళ్లింది..

పంచాయితీలు పెట్టినా కాపురం చక్కబడలేదు. మళ్లీ మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బొక్క మంతల పహాడ్‌కు చెందిన  శివన్నారాయణ, శ్యామలకు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. 
 
శివన్నారాయణ హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడు. కరోనా మహమ్మారి కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చి శివన్నారాయణ ప్రస్తుతం తమకు ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. అయితే వివాహమైన ఏడాది నుండి భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి.
 
గతంలో పెద్దమనుషులు పంచాయితీ పెట్టి ఇద్దరికీ సర్దిచెప్పి కలిసి ఉండాలని పంపించారు. అయినా తీరు మారలేదు. అయినప్పటికీ శివన్నారాయణ, శ్యామల దంపతులకు గొడవలు నిత్యకృత్యంగా మారాయి. 
 
ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మంగళవారం ఉదయం శ్యామల తన తల్లి గారి ఇంటికి ఫోన్ చేసి భార్యాభర్తల మధ్య జరిగిన గొడవను చెప్పి తీవ్రంగా దుఃఖించింది. 
 
తరచూ గొడవల నేపథ్యంలో, కుమార్తెను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్యామల తండ్రి సూర్యనారాయణ, తల్లి యశోద, అన్న శివ శివ నారాయణ ఇంటికి వెళ్లి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డారు. అలాగే భర్త కుటంబంపై కళ్ళలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు భార్య కుటుంబీకులు. 
 
శివన్నారాయణ అతని తండ్రి బిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్ళల్లో కారం కొట్టి కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శివన్నారాయణ తల్లి అచ్చమ్మ మృతి చెందగా, మిగతావారంతా తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
గాయపడిన ముగ్గురిని మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.