గురువారం, 10 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (09:46 IST)

ఉద్రిక్తంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ : కమిషనర్ ఆనంద్ తనిఖీలు

oldcity
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ భద్రతలో నిమగ్నమైవున్న పోలీసులపై గత రాత్రి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో గురువారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో శాలిబండలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పర్యటించించి పరిస్థితిని సమీక్షించారు. 
 
మహ్మద్ ప్రవక్త్‌ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా పాతబస్తీలో ఆందోళనకారులు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాత్రంతా రోడ్డు మీదకు రాకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. అలాగే, రాజాసింగ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన నిర్వహించిన అనేక మందిపై పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆర్పీఎఫ్ బలగాలు పాతబస్తీలో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించాయి. పోలీసులు అప్రమత్తమైనప్పటికీ కొందరు నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. శాలిబండ, సైదాబాద్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో యువకులు ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపుతప్పుతుందని భావించి వారిని చెదరగొట్టారు. 
 
మొగల్‌పూర్‌లో పలువురు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చార్మినార్‌, శాలిబండ వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి, రోడ్లను మూసివేశారు. ఇదిలావుండగా.. ఎంపీ అసద్దుద్దీన్‌, కార్పొరేటర్ల విజప్తి మేరకు అదుపులోకి తీసుకున్న 127 మందిని పోలీసులు విడుదల చేశారు. 
 
అర్థరాత్రి 3 గంటల సమయంలో యువకులను కంచన్‌బాగ్‌ పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంత వాతావరణం నెలకొన్నది. ఇవాళ కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. అలాగే, హైదరాబాద్ నగర వ్యాప్తంగా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.