సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By kiran
Last Updated : గురువారం, 20 జులై 2017 (13:12 IST)

హైదరాబాద్‌లో మరో పూర్ణిమాసాయి...

పూర్ణిమ సాయి సంఘటన ఇంకా మరువక ముందే అలాంటి మరో వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్‌ నం. ఏడులో నివసించే కాజల్‌ ముఖర్జీ (19) నటన మీద మోజుతో సెలబ్రిటీ కావాలన్న కోరిక కలిగి ఇంటి న

పూర్ణిమ సాయి సంఘటన ఇంకా మరువక ముందే అలాంటి మరో వ్యవహారం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ రోడ్‌ నం. ఏడులో నివసించే కాజల్‌ ముఖర్జీ (19) నటన మీద మోజుతో సెలబ్రిటీ కావాలన్న కోరిక కలిగి ఇంటి నుండి వెళ్ళిపోయింది. ఆమె ఇంటి నుండి పారిపోవడం ఇది రెండోసారి. మొదటిసారి ఆచూకీ కనిపెట్టి పోలీసులు ఇంటికి తీసుకువచ్చిన నాలుగు రోజులకే, మరోసారి ఇంటి నుండి వెళ్లిపోయింది. 
 
కాజల్‌ ముఖర్జీది సంపన్న కుటుంబం. తల్లి శామా ముఖర్జీ యోగా ట్రైనర్‌గా పని చేస్తూ ఉంటుంది, తండ్రి వీరికి దూరంగా ఉంటున్నారు. కాజల్‌ సోమాజిగూడలోని విల్లామేరీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. సెలబ్రిటీ కావాలన్న కోరిక బలంగా ఉన్న కాజల్‌ ధనవంతులతో, ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటేనే తన కోరిక తీరుతుందని భావించేది. 
 
అందులోభాగంగా ఆన్‌లైన్, సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు, స్నేహాలు పెంచుకొంది. అయితే శామా ముఖర్జీకి ఈ ధోరణి నచ్చకపోవడంతో తన కుమార్తెను స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు దూరంగా ఉంచింది. ఇది తట్టుకోలేకపోయిన కాజల్‌ ఈ నెల 8న ఇంటి నుంచి పారిపోయింది. అన్ని ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఆమె తల్లి శామా ముఖర్జీ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలతో వారం రోజుల పాటు గాలించిన పోలీసులు గత శనివారం కోల్‌కతాలో కాజల్‌ ఆచూకీ గుర్తించారు. అక్కడ నుంచి కాజల్‌ను తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. 
 
ఆ సందర్భంలో కాజల్‌ ‘‘మా అమ్మతో ఉండటం నాకిష్టం లేదు. మీరు బలవంతంగా పంపినా నేను ఒక రోజు కంటే ఎక్కువ ఉండలేను. మా అమ్మంటే నాకు చిరాకేస్తోంది’’ అని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. తన తల్లి ఫోన్‌ మాట్లాడనివ్వదని, ఎప్పుడూ తన పక్కనే ఉంటుందని, కంప్యూటర్‌ దగ్గరికి వెళ్లనివ్వదని, తాను ఎవరితో మాట్లాడినా ఆమెకు చెప్పాలంటుందని, చదువుకోమని ఒత్తిడి తెస్తుందని ఇలా అనేక కారణాలను కాజల్ పోలీసులకు తెలియజేసింది. 
 
పెద్ద సెలబ్రిటీని కావాలన్నది నా లక్ష్యమని, ఇక్కడే ఉంటే క్లర్క్‌ను కూడా కానివ్వదు అని తల్లికి దూరంగా వెళ్లిపోవాలనుకుంటున్నాను అని ఆమె చెప్పింది. అయితే కాజల్‌కు ఏదోరకంగా నచ్చజెప్పి పోలీసులు ఆమెను తల్లితో పంపించారు. తన పద్ధతి మార్చుకోని కాజల్‌ నాలుగు రోజులకే మళ్లీ ఇల్లు వదిలి పారిపోయింది. బుధవారం ఉదయం 11 గంటలకు తల్లితో చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో కుమార్తె కనిపించడం లేదంటూ తల్లి మళ్లీ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
తన కుమార్తె క్షణాల్లోనే ఎవరితోనైనా పరిచయాలు పెంచుకొని స్నేహితులుగా మార్చుకుంటుందని శామా ముఖర్జీ పోలీసులకు చెప్పారు. తన కుమార్తె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇక్కడి వాళ్లతోనే కాకుండా విదేశీయులు, ఇతర నగరాలకు చెందిన ఎంతో మందితో స్నేహం పెంచుకుందని ఆమె వివరించారు. తను వద్దన్నా వినకుండా స్మార్ట్‌ ఫోన్‌ వాడుతోందని, ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే తననో దోషిగా నిలబెడుతోందని ఆమె బాధపడ్డారు. మళ్లీ మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.