శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (11:37 IST)

హైదరాబాద్‌లో యువతుల మిస్సింగ్: ఆందోళనలో తల్లిదండ్రులు

హైదరాబాద్‌లో యువతుల మిస్సింగ్ కలకలానికి దారి తీసింది. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులు అదృశ్యం కావడం సంచలనంగా మారింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్సింగ్ కేసులు నమోదు చేసుకుని వారి కోసం గాలింపు చేపట్టారు. చిలకలగూడ, తిరుమలగిరి, లాలాగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ అదృశ్యం కేసులు నమోదయ్యాయి.
 
వివరాల్లోకి వెళితే.. చిలకలగూడలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీకి చెందిన బండారి రోహిణి(19) అమీర్‌పేటలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. బుధవారం ఇంట్లో అందరితో కలిసి నిద్రపోయిన రోహిణి గురువారం తెల్లారేసరికి కనిపించలేదు. ఆమె దుస్తులు, వస్తువులు కూడా కనిపించకపోవడంతో ఉద్దేశపూర్వకంగా వెళ్లిపోయి ఉండొచ్చని తల్లిదండ్రులు భావిస్తున్నారు. యువతి తండ్రి జగదీశ్వరరావు ఫిర్యాదుతో చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
లాలాగూడలో నివాసముండే శ్రీధర్‌ కూతురు కీర్తి ప్రజ్ఞ(20) గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లి సాయంత్రమైనా తిరిగి రాలేదు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో ఆందోళన చెందిన శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
తిరుమలగిరిలోని ఓ స్కూల్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న మంజుల(20) అనే యువతి అదృశ్యమైంది. సాయిబాబా హాట్స్‌కు చెందిన మంజుల రోజులాగే గురువారం కూడా స్కూల్‌కి వెళ్లింది. అక్కడ ఓ లెటర్ రాసి దాన్ని తన కుటుంబసభ్యులకు ఇవ్వాలంటూ కొలీగ్స్‌కి ఇచ్చి వెళ్లిపోయింది. 
 
సాయంత్రమైనా మంజుల ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్కూల్‌కి వెళ్లి ఆరా తీశారు. సిబ్బంది ఆమె రాసిన లెటర్ అందజేశారు. ‘నాకు ఇంట్లో ఉండబుద్ధి కావడం లేదు’ అని లెటర్‌లో రాసి ఉంది. దీంతో కంగారుపడిన పేరెంట్స్ తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకేరోజు ముగ్గురు యువతులు అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. యువతుల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.