సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (15:03 IST)

133 దేశాల నుండి వారిని రప్పిస్తున్న కేసిఆర్... ఎందుకు?

యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన కేసిఆర్, విహంగ వీక్ష‌ణం ద్వారా ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. ప్ర‌ధానాల‌యం, వ్ర‌త మంట‌పం, శివాల‌యం ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి క్షేత్రం ప్రపంచంలోనే ప్రత్యేకమైన ఆలయం. దీని కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఆలాంటి ఆలయం నిర్లక్ష్యానికి గురికాకూడదని కేసిఆర్ అన్నారు. 
 
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది, వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఆలయ నిర్మాణ ప్రక్రియలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం రూ. 10 కోట్ల వరకూ విరాళాలను స్వీకరించాం. ఉత్తర భాగంలో ఆలయం కిందివైపు భూమిని సేకరించాం. స్థల సేకరణకు 70 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. 
 
బస్‌స్టేషన్‌లు, నిత్యాన్నదాన సత్రాల నిర్మాణం వంటి తదితర అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఆగమశాస్త్రం ప్రకారంగానే ఆలయ నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఏడు అంతస్తుల గోపురం నిర్మాణం కూడా శిల్పాలతోనే రూపుదిద్దుకుంది. దేవాలయాలు ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతిని, సాంప్రదాయాన్ని అందిస్తాయి. 
 
250 ఎకరాలలో 350 క్వార్టర్‌ల నిర్మాణం చేపడుతుండగా వాటి కోసం విరాళం ఇవ్వడానికి 43 మంది దాతలు ముందుకు వచ్చారు. గంధమల్ల, బస్వాపూర్ ప్రాజెక్టులు నిర్మాణం కొనసాగుతోంది. 50 ఎకరాలలో ప్రవచన మండపం నిర్మిస్తాం అని చెప్పారు. మరో పదీపదిహేను రోజుల్లో మళ్లీ యాదాద్రిని సందర్శిస్తానని, ఆలయ ప్రారంభోత్సవానికి 133 దేశాల నుండి వైష్ణవ పండితులు రాబోతున్నారని, అష్టాదశ శక్తి పీఠాల్లో ఆలంపూర్ కూడా ఒకటి, గత పాలకులు జోగులాంబ శక్తిపీఠాన్ని పట్టించుకోలేదని సీఎం వ్యాఖ్యానించారు.