గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (11:38 IST)

హరీష్ రావుకు మొండిచేయి... కేసీఆర్ కేబినెట్లో నో బెర్త్?

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెరాస విజయంలో అత్యంత కీలక భూమిక పోషించిన నేతల్లో హరీష్ రావు ఒకరు. సంగారెడ్డిలో పోటీ చేస్తూనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించారు. మొత్తం 119 సీట్లలో గెలిచిన అభ్యర్థుల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిచిన నేత హరీష్ రావు. అయితే, ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. తన మంత్రివర్గాన్ని ఇంకా విస్తరించలేదు. 
 
ఈ నేపథ్యంలో ఆయన తన తొలి విడత మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించవచ్చన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ దఫాలో హరీష్ రావుతో పాటు తన కుమారుడు కేటీఆర్‌లకు ఆయన మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా లేదా అన్నది ఇపుడు సందేహాస్పదంగా ఉంది. 
 
ముఖ్యంగా, కేటీఆర్‌కు చోటు దక్కినప్పటికీ, పార్టీ కార్యకలాపాలకు ఎక్కువ సమయం వెచ్చించటానికి వీలుగా చిన్న శాఖలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక హరీశ్‌ రావుకు గత ప్రభుత్వంలో నిర్వహించిన నీటిపారుదల శాఖ ఈసారి దక్కకపోవచ్చని ఆయన సన్నిహిత వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చాయి. 
 
హరీశ్‌ను ఈ సారి అసలు కేబినెట్‌లోకి తీసుకుంటారా? లేదా? ఒకవేళ తీసుకుంటే, తొలి విడత విస్తరణలోనా? లేక మలి విడత విస్తరణలోనా? అనే చర్చ జరుగుతోంది. కేటీఆర్‌, హరీశ్‌రావు ఇద్దరికీ తొలి దఫా కేబినెట్‌ విస్తరణలో చోటు ఉండకపోవచ్చని, త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ తరపున వారిని విస్తృతంగా తిప్పి, ఆ తర్వాత పూర్తిస్థాయి కేబినెట్‌ విస్తరణలో అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం సాగుతోంది.