గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : బుధవారం, 16 జనవరి 2019 (16:31 IST)

అమరావతికి కేసీఆర్ వచ్చి చర్చిస్తారు : జగన్ మోహన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ త్వరలోనే అమరావతికి వచ్చి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరుపుతారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైదరాబాద్‌ లోటస్ పాండ్‌లో జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య గంటన్నరపాటు చర్చలు జరిగాయి. 
 
ఆ తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌ ఫోన్‌ చేసి చెప్పిన తర్వాత.. కేటీఆర్‌ వచ్చి నాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రాన్ని ఎదుర్కోవాలంటే.. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం గురించి చర్చించారని చెప్పారు.
 
ముఖ్యంగా, ఏపీ ప్రత్యేక హోదా విషయమే పరిశీలిస్తే.. పార్లమెంట్‌ వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన హామీకే దిక్కులేదు. హోదా విషయంపై మేం ఎంత పోరాడినా కేంద్రంలో కదలిక లేదు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కుల నిలబడాలంటే రాష్ట్రాల తరపున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పారు. 
 
అలాగే, హోదా సాధనకు ఎంపీల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్‌ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్టీలో విస్తృతంగా చర్చిస్తాం అని జగన్ చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎక్కువ ఎంపీల మద్దతు అవసరమందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు కలిసివస్తే.. ఏపీకి మరింత మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.