దేశ వ్యాప్తంగా రైతు బంధు పథకం : ప్రధాని మోడీ యోచన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రైతులు, ఇతర అల్పాదాయ వర్గాలకు చెందిన ప్రజలకు ఆర్థిక సహాయం (నగదు బదిలీ) చేసేందుకు వీలుగా ఈ తరహా పథకాలను ప్రవేశపెట్టాలన్న భావనలో ప్రధాని ఉన్నట్టు తెలుస్తోంది.
కష్టాలు, అప్పుల ఊబిలో ఉన్న రైతులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముఖ్యంగా, ఒక్కో ఎకరానికి రూ.4 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవసాయ పెట్టుబడి సాయంగా అందజేస్తున్నారు. పైగా, ఈ మొత్తం తిరిగి చెల్లించనక్కర్లేదు.
ఇదేవిధంగానే ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రైతులను తమవైపునకు ఆకర్షించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, ఈ పథకానికి భారీగా ఆర్థిక నిధులు అవసరం కనుక ఆ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకొనే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి. ఈ పథకంపై ప్రస్తుతం వ్యవసాయ మంత్రిత్వశాఖ, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వం రైతుల ఆర్థిక సాయం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించే ఆలోచన చేస్తోంది. ఇందుకయ్యే వ్యయం, విధివిధానాలు ఖరారయ్యాక త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
వ్యవసాయ భూమి కలిగిన రైతులకు యేడాదికి ఎకరాకు రూ.4 వేలు నగదు నేరుగా బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్టు కొన్ని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఇది రైతులందరికీ వర్తింపజేయాలా లేక సన్నకారు, చిన్నకారు, మధ్య తరహా రైతులకే పరిమితం చేయాలా అనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతుబంధు పథకం (వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.8,000 నగదు) తరహాలో ఉంటుంది. తెలంగాణ రైతు బంధుని ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్న విషయం తెల్సిందే.