కాంగ్రెస్ కంచుకోటలో ప్రధాని మోడీ .. లోక్‌సభ ప్రచారానికి శ్రీకారం
కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ గడ్డపై ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి అడుగుపెట్టారు. ఇక్కడ నుంచే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాయ్‌బరేలి స్థానం దివంగత ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలకు కంచుకోట. అలాంటి కోటలో రూ.వెయ్యి కోట్లకిపైగా విలువ చేసే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ఇలా రాయ్‌బరేలీ టూర్ పెట్టుకోవడం వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీలో జోష్ పెంచేందుకు మోడీ తయారనీ అందుకోసమే ఆయన రాయ్‌బరేలీని ఎంచుకున్నట్టు తెలుస్తోది. పైగా, రాయ్‌బరేలీలో మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.
కాగా, ఇటీవల వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చిత్తుగా ఓడిపోయింది. ఏకంగా మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. అయితే, ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ రాయ్‌బరేలీ మాత్రం పర్యటించాలని మోడీ ముందుగానే తన పర్యటన ప్లాన్‌ను ఖరారు చేసుకున్నారు.
నిజానికి గత ఎన్నికల్లో రాయ్‌బరేలీకి పక్కనే ఉన్న అమేథీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయగా, ఆయనపై బీజేపీ తరపున స్మృతి ఇరానీ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె రాయ్‌బరేలీ నియోజకవర్గాన్ని తరచూ సందర్శిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలనాటికి రాయ్‌బరేలీ ప్రజల్లోకి చొచ్చుకుపోవాలనేది బీజేపీ వ్యూహం. ఇప్పుడా వ్యూహంలో భాగంగానే మోడీ టూర్ కూడా ఏర్పాటైందంటారు.
ఇదిలావుంటే, ఆదివారం ప్రధాని మోడీ ఓ బహిరంగసభ నిర్వహించారు. అందులోనే హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుని ప్రారంభించారు. యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఏర్పాట్లు చేశారు. రాయ్‌బరేలీలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీని కూడా మోడీ పరిశీలించారు. మోడీ రాయ్‌బరేలీ టూర్‌లో దాదాపు రూ.1100 కోట్ల మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఇదిలావుండే, గత ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా సోనియా గాంధీ ఒక్కసారి కూడా రాలేదు. దానికి ముందు సోనియా.. 2016 మధ్యలో ఓసారి స్థానికులకు కనిపించి వెళ్లిపోయారు. 2017 యూపీ ఎన్నికలలోనూ సోనియా ప్రచారం చేయలేదు. దీంతో నెహ్రూ-గాంధీ కుటుంబం హవాని వీలైనంత తగ్గించడానికి ఇదే అవకాశమని కమలదళం భావిస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ కూడా రాయ్‌బరేలీ అభివృధ్దిని బీజేపీనే అడ్డుకుంటుందని ప్రచారం చేస్తోంది. ఈ మధ్యనే కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తన ఎంపీ లాడ్స్ నుంచి కొంత నిధులు రాయ్‌బరేలీకి విడుదల చేశారు. మోడీ తన టూర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కన్పిస్తోంది. మోడీ రాయ్‌బరేలీ పర్యటన తర్వాత అలహాబాద్ కుంభమేళా పనులను పర్యవేక్షించేందుకు వెళ్తారు.