శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (11:50 IST)

అనుమానాస్పదంగా అక్క మృతి.. ప్రియుడితో కలిసి పారిపోయిన చెల్లెలు

deepti
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్ల యువతి దీప్తి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకొంది. చెల్లెలు చందన ఆడియో మెసేజ్ బయటకు రావడంతో ఎవరు హత్య చేసి ఉంటారన్న అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు. అక్కయ్య హత్యకు.. తనకు ఎలాంటి సంబంధం లేదని చెల్లెల్లు దీప్తి ఆడియో బయటపడటం.. ఇంట్లో నుంచి రూ.కోటి విలువ గల బంగారం మాయంకావడంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేశారు.
 
కోరుట్ల మండలం భీముని దుబ్బ ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతుల ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె దీప్తి ఇంట్లోని సోఫాలో అనుమానాస్పదంగా మృతి చెందింది.మృతురాలి చెల్లెలు చందన తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఓ ఫంక్షన్ నిమిత్తం తల్లిదండ్రులు సోమవారం హైదరాబాద్ నగరానికి వెళ్ళగా, ఉదయం దీప్తి సోఫాలో శవమై కనిపించింది. మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో చిన్న కూతురు చందన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లిపోయినట్లు బస్ స్టాండ్ సీసీటీవీ ఫుటేజిలో నమోదైంది. 
 
ఇంట్లో వోడ్కా, బ్రీజర్, వెనిగర్, నిమ్మకాయలు ఉండగా మద్యం సేవించిన అనంతరం దీప్తిని చంపారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. ఇదిలావుంటే, తన అక్క దీప్తిని తాను చంపలేదు అంటూ తమ్ముడు సాయికి చందన వాయిస్ మెసేజ్ పంపించింది. అయితే, దీప్తి శరీరంపై గాయాలతో పాటు ఆమె ఎడమ చేయి విరిగడంతో హత్య కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 
 
కాగా, తమ్ముడు సాయికి చందన్ పంపిన వాయిస్ మెసేజ్‌లో "అరేయ్ సాయి నేను చందక్కనురా, నిజమెంటో చెప్పాలారా. దీప్తిక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ, అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్‌ను పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.
 
"నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నాం. అది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాం. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయిన. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మురా. మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయిన ఇట్లా అయితదనుకోలేదు. నేనెందుకు చంపుతా సాయి, నేనేందుకు మర్డర్ చేస్తా'' అంటూ వాపోయింది.