శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:45 IST)

నా భార్యను పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశా.. మీరెలా కనిపెట్టారు.. పోలీసులకు డాక్టర్ రాధ భర్త

murder
ఇటీవల మచిలీపట్నంలో డాక్టర్ రాధ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సూత్రధారి ఆమె భర్త, కారు డ్రైవర్ మధులు అని పోలీసులు తేల్చేశారు. పైగా, వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు డాక్టర్ రాధ భర్త డాక్టర్ లోకనాథ్ మహేశ్వర రావు ఓ ప్రశ్న సంధించారు. తాము పక్కాగా ప్లాన్ చేసి హత్య చేశాం.. మీరెలా కనిపెట్టారు అంటూ అడగడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు. 
 
మచిలీపట్నంలో సంచలనం సృష్టించిన డాక్టర్‌ రాధ హత్య కేసులో సూత్రధారి, నిందితుడైన... భర్త ప్రణాళిక, అమలు కరుడుగట్టిన హంతకుడికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు విని నిర్ఘాంతపోవడం పోలీసుల వంతైంది. గత నెల 25న మచిలీపట్నంలో తన ఇంట్లో డాక్టర్‌ రాధ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆమె భర్త మహేశ్వరరావు, డ్రైవర్‌ మధులను పోలీసులు శుక్రవారం అరెస్టు చూపించారు. నిందితులను మచిలీపట్నం కోర్టులో శనివారం హాజరుపరచగా, వీరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు.
 
ఆధారాలను పోలీసులు మధుకు చూపించిన తర్వాత కానీ హత్య చేసిన తీరును వివరించలేదు. ఇద్దరం కలసి చంపేశామని వెల్లడించాడు. సాయంత్రం 5.55 గంటల నుంచి 6.02 మధ్య జరిగిందని ఇంటరాగేషన్‌లో చెప్పాడు. ఆ వివరాల ఆధారంగా డాక్టర్‌ మహేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తొలుత నోరు విప్పలేదు. 
 
ఆ తర్వాత కానీ బయటపడలేదు. తాను పక్కా ప్రణాళిక ప్రకారమే ఆధారాలు లేకుండా హత్య చేశాననీ, మీరెలా చేధించారని దర్యాప్తు అధికారులను నిందితుడు మహేశ్వరరావు ప్రశ్నించారు. తాను ఎక్కడా దొరక్కుండా ఉండేందుకు ప్రొఫెషనల్‌ కిల్లర్‌ మాదిరిగా అనేక విధాలా ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
 
భార్యను హత్య చేసిన అనంతరం నేరుగా కింద ఉన్న తన ఛాంబర్‌లోకి వచ్చారు. హత్యతో తనకు సంబంధం లేదని నిరూపించుకునేందుకు తీవ్రంగా తాపత్రయపడ్డారు. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో వివిధ అంశాలపై అన్వేషించారు. తాను ఫలానా సమయంలో అంతర్జాలానికి అనుసంధానమై ఉన్నానని ఎలిబీ సృష్టించుకునేందుకే ఇదంతా చేసినట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనూ ఆ డేటా ప్రింట్‌ తీసుకుని వచ్చాడు. దాని ఆధారంగా నమ్మించేందుకు ప్రయత్నించారు. 
 
ఆసుపత్రిలో ప్రతి అంతస్తుకు ప్రత్యేకంగా వైఫై రూటర్లు ఉన్నాయి. వీటికి అనుసంధానమైన ఫోన్ల వివరాలను పరిశీలించగా.. హత్య జరిగిన సమయంలో రెండో అంతస్తులోని రూటర్‌కు అనుసంధానం అయినట్లు బయటపడింది. ఆ తర్వాత కింది అంతస్తులోని వైఫైకు రాత్రి 10.30 గంటల వరకు కనెక్ట్‌ అయినట్లు వెలుగుచూసింది. డాక్టర్‌ను కస్టడీ పిటిషన్‌ వేసి మళ్లీ అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారించే యోచనలో పోలీసులు ఉన్నారు. మొత్తంగా సాంకేతిక ఆధారాలతో కేసును పోలీసులు ఛేదించడంలో సఫలీకృతులు అయ్యారు.