కొటక్ మహింద్రా బ్యాంక్ ఆధ్వర్యంలో కూలీలకు హైదరాబాద్ ఏపీఎంసీ మార్కెట్ల వద్ద రేషన్ కిట్ల అందజేత
కరోనా మహమ్మారి కొనసాగుతున్న సమయంలో, దేశవ్యాప్తంగా ఆహార సరుకులను అన్ని వర్గాలకు చేరవేస్తున్న వారికోసం పగలూ రాత్రి శ్రమిస్తున్న జట్టు కూలీలకు అండగా నిలిచేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ (కొటక్) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లలో పనిచేస్తున్న జట్టు కూలీలకు డ్రై రేషన్ కిట్లను అందజేస్తున్నట్లు నేడు ప్రకటించింది.
అత్యవసరమైన ఆహార పదార్థాలను సరఫరా చేయడంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏపీఎంసీలు క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఏపీఎంసీలు విజయవంతంగా పనిచేయడంలో రోజు కూలీలు లేదా జట్టు కూలీల పాత్ర అతి ముఖ్యమైనది. రోజువారీ కూలీ తీసుకునే వీరు ప్రతి రోజూ వేలాది టన్నుల కొద్ది ధాన్యం, కూరగాయలు మరియు పండ్లు, లోడింగ్ మరియు అన్‌లోడింగ్ చేస్తూ దేశానికి సంబంధించిన అత్యవసరమైన ఆహార పదార్థాలు ప్రతిరోజూ అందజేస్తున్నారు.
ఈ జట్టు కూలీ కార్మికులకు అండగా ఉండటంలో భాగంగా కొటక్ ఆధ్వర్యంలో హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, జోద్‌పూర్ మరియు ఇండోర్‌లలోని ఏపీఎంసీ మార్కెట్లలో డ్రై రేషన్ అందించారు.
కొటక్ మహీంద్రా బ్యాంక్ కమర్షియల్ బ్యాంకింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ డి.కన్నన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ``కూరగాయలు, పండ్లు మరియు వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తులు దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ ఆహార సరఫరా పక్రియను సమర్థవంతంగా కొనసాగించడంలో జట్టు కూలీ కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏపీఎంసీల యొక్క సహజసిద్ధమైన నిర్వహణ ప్రక్రియను దెబ్బతీసింది. దీనివల్ల రోజువారీ కూలీలు ఆదాయం పెద్దఎత్తున కోల్పోవాల్సి వచ్చింది. జట్టు కూలీలు నిరంతరం చేస్తున్న వెలకట్టలేని శ్రమ యొక్క ప్రయత్నాన్ని గుర్తించి మావంతు సహాయంలో భాగంగా డ్రై రేషన్ కిట్లను అందజేస్తున్నాం. తద్వారా వారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టాలలో అండగా నిలుస్తున్నాం`` అని తెలియజేశారు.