గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 10 ఆగస్టు 2020 (21:33 IST)

మార్గదర్శి కేసులో రామోజీరావు కు సుప్రీం కోర్టు నోటీసులు

మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేయడంతో ఈనాడు రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉండవల్లి పిటిషన్‌ను జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది.
 
రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజి కృష్ణంరాజును కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేసేందుకు ఉండవల్లి దరఖాస్తు చేయడంతో ఇందుకు సుప్రం కోర్టు అనుమతి మంజూరు చేసింది. అంతేకాదు ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్.బి.ఐ, కృష్ణంరాజులకు సుప్రీంకోర్టు ఈ విషయంపై నోటీసులు ఇచ్చింది. “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం” నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజి కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు.
 
అయితే “ఉమ్మడి హిందూ కుటుంబం” (హెచ్.యు.ఎఫ్) ద్వారా డిపాజిట్ల సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టుకు రామోజీ రావు తరుపు న్యాయవాదులు వాదనలు వినిపించిన నేపధ్యంలో “ఉమ్మడి హిందూ కుటుంబం”  (హెచ్.యు.ఎఫ్) ఒక వ్యవస్థ కాదు, ఒక కంపెనీ కాదు, ఒక ఫర్మ్ కాదు, వ్యక్తుల సమూహం కూడా కాదు. కాబట్టి, “ఆర్బీఐ చట్టం” సెక్షన్ 45( ఎస్) నిబంధనలు వర్తించవని రామోజీ రావు చేసిన వాదనలతో అంగీకరించి ఉమ్మడి హైకోర్టు విభజన రోజున ఈ కేసును కొట్టివేసింది.
 
అయితే ఉమ్మడి హైకోర్టు తీర్పును, ఆలస్యంగా గ్రహించిన ఉండవల్లి, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 266 రోజుల పాటు జరిగిన జాప్యాన్ని మన్నించాలని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఫిర్యాదుదారులయిన   ఐజి కృష్ణంరాజు వాదనలు గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనలు గాని వినకుండానే ఈ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఉండవల్లి సుప్రీం కోర్టు ముందు బలంగా వాదనలు వినిపించారు.
 
రిజర్వ్ బ్యాంకును కూడా పార్టీగా చేర్చమని ఉండవల్లి దాఖలు చేసుకున్న దరఖాస్తుకు కూడా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అందులో భాగంగానే సోమవారం రామోజీ రావుకు, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.