సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఆగస్టు 2020 (20:21 IST)

సుప్రీంకోర్టులో విజయ్ మాల్యా కేసుకు సంబంధించిన పత్రాలు మాయం

ప్రభుత్వ బ్యాంకులకు రూ.9 వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో కొత్త ట్విస్టు నెలకొంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యాను, తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఆయన స్వదేశానికి వస్తారని సంకేతాలు అందుతున్నాయి. 
 
ఈ తరుణంలో సుప్రీంకోర్టులో కొన్ని ముఖ్యమైన పత్రాలు మాయమవడం సంచలనంగా మారింది. జూలై 14, 2017 నాటి తీర్పుకు వ్యతిరేకంగా మాల్యా దాఖలు చేసిన సమీక్ష పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో వీడియో కాన్ఫరెన్స్ విచారణ సందర్భంగా పత్రాలు మాయం అవడం కలకలం రేపింది. దీంతో న్యాయమూర్తులు లలిత్, అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఆగస్టు 20కి వాయిదా వేశారు. మరోవైపు విచారణ సందర్భంగా కీలక పత్రాలు మాయం కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
 
మాల్యా రివ్యూ పిటిషన్‌ని సంబంధిత కోర్టులో గత మూడేళ్లుగా ఎందుకు లిస్ట్ చేయలేదో స్పష్టం చేయాల్సిందిగా రిజిస్ట్రీని.. జస్టిస్‌ లలిత్‌, భూషణ్‌లు ఆదేశించారు. ఈ మూడు సంవత్సరాల్లో ఈ రివ్యూ పిటిషన్‌కి సంబంధించిన ఫైల్‌ను ఏయే అధికారులు డీల్ చేశారో వారి పేర్లతో సహా అన్ని వివరాలను తెలపాలని వారు సూచించారు. 
 
కాగా, తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లను బదలాయింపులో కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు ఆయనపై ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తనను దోషిగా పేర్కొంటూ.. 2017 లో కోర్టు తీర్పును రివ్యూ చేయవలసిందిగా మాల్యా పిటిషన్ దాఖలు చేశారు.