సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (23:22 IST)

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు... అద్వానీకి 100 ప్రశ్నలు.. 4 గంటల పాటు..?

బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ వాంగ్మూలాన్ని లఖ్‌నవూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేసింది. మసీదు కూల్చివేత కేసులో 49 మంది నిందితుల పేర్లను సీబీఐ నమోదు చేయగా, వారిలో 32 మంది సజీవంగా ఉన్నారు. వారందరి నుంచి సీఆర్‌పీసీలోని 313 సెక్షన్‌ కింద వాంగ్మూలాల నమోదు ప్రక్రియ జరుగుతోంది. 
 
తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ స్టేట్‌మెంట్‌ను కోర్టు నాలుగు గంటల పాటు రికార్డు చేసింది. శుక్రవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో అద్వానీని దాదాపు 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. 
 
ఈ విచారణలో తనపై వచ్చిన ఆరోపణలను అద్వానీ ఖండించారని ఆయన తరఫు న్యాయవాది వెల్లడించారు. ఈ కోర్టు విచారణ నేపథ్యంలో బుధవారం రోజున అద్వానీ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలూ దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు.