గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (15:47 IST)

సచిన్ పైలెట్‌కు తాత్కాలిక ఊరట : 24 వరకు చర్యలొద్దన్న కోర్టు

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌ వర్గానికి తాత్కాలిక ఊరట లభించింది. సచిన్ పైలట్‌తో పాటు ఆయన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాజస్థాన్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 
 
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్... ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పైలట్ తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. దీంతో స్పీకర్ జోషి వీరికి అనర్హత నోటీసులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ తిరుగుబాటు దారు సచిన్ పైలట్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 
 
ఈ కేసులో పైలట్ తరపున తరపున న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తూ, పైలట్‌తో పాటు మరో 18 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ జోషి అత్యుత్సాహం ప్రదర్శించారని కోర్టులో వాదించారు. 
 
పైలట్‌తో పాటు మరో 18 మందికి నోటీసులు జారీ చేసే సమయంలో స్పీకర్ ఎలాంటి కారణాలు చూపకుండానే నోటీసులు జారీ చేశారని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి... వాటిపై స్పందనకు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఇచ్చారని, దీన్ని బట్టే స్పీకర్ శైలి ఏంటో అర్థమైపోతుందని రోహత్గీ వాదించారు.