శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (15:56 IST)

సత్యాన్ని వక్రీకరించగలరేమోగానీ దాన్ని ఓడించలేరు : సచిన్ పైలట్

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, కూలదోచేందుకు కారణమై, పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పడేసే చర్యలకు దిగిన యువనేత, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించడమేకాకుండా, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవి నుంచి కూడా ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించింది. 
 
కేవలం సచిన్ పైలట్‌నే కాదు... ఆయన పక్షాన నిలిచిన ఇద్దరు మంత్రులను కూడా క్యాబినెట్ నుంచి తప్పించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు.
 
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనిపై చర్చించేందుకు సీఎల్పీ రెండు పర్యాయాలు సమావేశమైంది. 
 
సీఎల్పీ భేటీకి రావాలంటూ రెండుసార్లు ఆహ్వానించినా సచిన్ పైలట్ నుంచి జవాబు రాకపోవడంతో ఆయనను సాగనంపడమే మంచిదని పార్టీ తీర్మానించింది. సచిన్ పైలట్‌పై వేటు వేసే తీర్మానానికి సభ్యులందరూ ముక్తకంఠంతో సరేననడంతో అధిష్టానం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది.
 
దీనిపై రాష్ట్ర గవర్నర్‌కు నివేదించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌ను, మరో ఇద్దరు మంత్రులను క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్‌కు తెలియజేశారు.
 
తనపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేయడంపై సచిన్ పైలట్ స్పందించారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ, 'సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ.. దాన్ని ఓడించలేరు' అని పేర్కొన్నారు. 
 
మరోవైపు, సచిన్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం అందే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రంలోపు తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు పీసీసీ పదవి నుంచి సచిన్‌ను తొలగించిన వెంటనే ఆయన స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించారు.