కరోనావైరస్ పాజిటివ్ వృద్ధురాలు, ఆంబులెన్స్ నుంచి దిగి పరార్
కరోనావైరస్ సోకిన ఓ వృద్ధురాలు చికిత్స కోసం ఆస్పత్రికి రానంటూ హల్చల్ చేసింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో చోటుచేసుకున్నది. వివరాలిలా వున్నాయి. శంకరపట్నం మండలంలో ఓ గ్రామానికి చెందిన వృద్ధురాలికి ఇటీవల కరోనావైరస్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
దీంతో చికిత్స కోసం ఆమెను ఆంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. ఐతే తను ఆస్పత్రికి రానని సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. చివరకు ఎలాగో ఆంబులెన్స్ ఎక్కిన ఆ వృద్దురాలు మార్గమద్యమంలో మలవిసర్జన కోసమని చెప్పి ఆంబులెన్స్ నుండి దిగి పారిపోయింది.
ఆ వృద్దురాలు తిరిగి శంకరపట్నం వెళ్లిందని తెలుసుకున్న అధికారులు ఆంబులెన్స్ తీసుకెళ్లగా తాను రానని మొరాయించింది. దాదాపు గంటసేపు అధికారులను ముప్పుతిప్పలు పెట్టించి చివరకు అంగీకరించింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకొని వృద్దురాలిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.