ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జులై 2020 (10:10 IST)

ఇక తెలంగాణాలో కేటీఆర్ అంబులెన్సులు!!

తెలంగాణ రాష్ట్ర మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జూలై 24వ తేదీన తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకుగాను ప్రభుత్వ ఆస్పత్రులకు అంబులెన్సులను అందజేస్తానని ప్రకటించారు. 
 
తన వంతుగా ఆరు అంబులెన్సులను సమకూరుస్తానన్నారు. శుక్రవారం కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మంత్రి ఈటల రాజేందర్‌ ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రులకు అంబులెన్సులను అందజేస్తానని ఈటలకు కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 
 
అంబులెన్సుల కొనుగోలుకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని, పార్టీ తరపున వాటిని అందజేస్తానని అన్నారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అంబులెన్సులు ఏర్పాటు చేసినప్పటికీ.. నిర్ధారణ పరీక్షలు చేసే అంబులెన్సుల అవసరం ఎక్కువగా ఉంటోందని కేటీఆర్‌ దృష్టికి ఈటల తీసుకెళ్లారు. గ్రామీణ ఆస్పత్రుల్లో కరోనా నిర్థారణ పరీక్షలకు వాటిని వాడుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
 
కేటీఆర్ నిర్ణయం పట్ల మంత్రి ఈటల హర్షం వ్యక్తం చేస్తూ, తాను కూడా తన నియోజకవర్గం, కరీంనగర్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఐదు అంబులెన్సులను సమకూరుస్తామని తెలిపారు. కాగా, కేటీఆర్‌ బాటలో నడిచేందుకు మరికొంత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ముందుకొచ్చారు.