సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2020 (12:03 IST)

నన్ను ప్రేమించమంటే ప్రేమించవా? మైనర్ బాలికను బీరు సీసాతో పొడిచేశాడు

ఇటీవలి కాలంలో ప్రేమ పిచ్చోళ్లు ఎక్కువయిపోతున్నారు. తమకు నచ్చిన అమ్మాయిని ప్రేమిస్తావా లేదా అంటూ పైశాచికంగా ప్రవర్తిస్తూ వారి వెంటబడుతూ వేధిస్తున్నారు. కొన్నిసార్లు ఇలాంటివారు యువతుల ప్రాణాలను తీస్తున్నారు. కొన్నిసార్లు అదృష్టవశాత్తూ వారి దాడి నుంచి యువతులు తప్పించుకుంటున్నారు.
 
ఇలాంటి ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. తన ప్రేమ‌ను ఒప్పుకోవ‌డంలేద‌ని ఓ యువ‌కుడు మైన‌ర్ బాలిక‌పై బీర్ సీసాతో దాడి చేసి చంపేయాలని చూశాడు. వివరాల్లోకి వెళితే... వరంగల్‌ 11వ డివిజన్ ‌క్రిస్టియన్‌ కాలనీకి చెందిన బసికె నిఖిల్‌ 10వ డివిజన్‌ అబ్బనికుంటకి చెందిన మైనర్‌ బాలిక వెంట గత కొంతకాలంగా ప్రేమ అంటూ వేధిస్తున్నాడు. తొలుత అతడి విషయాన్ని లైట్ గా తీసుకుంది. 
 
ఐతే అతడు వేధింపులను ఎక్కువ చేశాడు. దాంతో ఆమె అతడు కనబడితే దూరంగా వెళుతూ జాగ్రత్తపడింది. దీనితో ఆమెపై పగ పెంచుకున్న సదరు యువకుడు నేరుగా ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి మళ్లీ ప్రేమ విషయమై వాదించాడు. ఆమె ససేమిరా అనేసరికి బీర్ సీసా పగులగొట్టి ఆమెను పొడిచేందుకు ప్రయత్నించాడు.
 
ఆమె అతడి నుంచి చాకచక్యంగా తప్పించుకోవడంతో చేతులపై గాయాలయ్యాయి. పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను రక్షించారు. యువకుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.